కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి తగ్గి.. క్రమంగా కేసులు తగ్గుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులు ప్రకటించారు.. మార్చి 3 నుండి కొత్త సడలింపులు అమలులోకి రానున్నాయి.. వివాహాలు, ఇతర సంబంధిత కార్యక్రమాలలో 500 మందిని అనుమతించాలని, అంత్యక్రియలు మరియు ఇతర సంబంధిత కార్యక్రమాలలో 250 మంది పాల్గొనవచ్చు అని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్. ఇక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలను అనుమతిచ్చారు.. ఈ సడలింపుతో గురువారం నుంచి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సభలపై నిషేధం తొలగిపోనుంది. తాజా ఆంక్షలు మార్చి 3 నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఈ రెండు పరిమితులు కాకుండా కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి గతంలో విధించిన అన్ని ఇతర పరిమితులు ఉపసంహరించబడ్డాయి.
Read Also: Vellampalli Srinivas: జగన్‌ను ఓడించడం ఎవరి తరం కాదు.. 175 స్థానాలు మావే..!
మరోవైపు, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన ఆంక్షలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రాయితీలపై నిర్ణయాలు తీసుకోవడానికి రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అవలంబించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల తగ్గింపును పరిగణనలోకి తీసుకుని, ప్రజలు తమ రోజువారి పనులు చేసుకునేందుకు వీలుగా సడలింపులు ప్రకటించామన్న ఆయన.. ఇదే సమయంలో ప్రజలు మాస్కులు ధరించడం కొనసాగించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అంతేకాకుండా, ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు వీలైనంత త్వరగా వేయించుకోవాలని కోరారు. కాగా, తమిళనాడులో మంగళవారం 348 కొత్త కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 1,025 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.