Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ముఖ్య సలహాదారుడిగా తన గుండా బిభవ్ కుమార్‌ని కేజ్రీవాల్ నియమించారని, పంజాబ్ నుంచి దోచుకున్న డబ్బుని ఢిల్లీకి తీసుకువస్తున్నడని మంగళవారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తనను తాను సరిదిద్దుకోవాలని లేకపోతే ఢిల్లీలో జరిగిందే పంజాబ్లో జరుగుతుందని హెచ్చరించారు.
Read Also: Agatya Trailer: “120 ఏళ్ల క్రితం ఆత్మలని కలవాలనుకుంటున్నారా?” ‘అగత్యా’ ట్రైలర్ చూసేయండి..
పంజాబ్ ఇసుక మాఫియా గుప్పట ఉందని, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో బదిలీ పోస్టింగుల్లో ప్రతీ చోట అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ల నుంచి విస్తృతంగా దోపిడీ జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీకి డబ్బు తిరిగి పంపే ప్రయత్నంలో కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం తన “గూండా” బిభవ్ కుమార్‌ను పంజాబ్‌కు పంపించాడా అని మలివాల్ ప్రశ్నించారు. కొంత మంది పంజాబ్‌ని తమ సొంత ఏటీఎంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ ఏమీ చేయలేదని ఎమ్మెల్యేలు, ప్రజలు చాలా కోపంగా ఉన్నానని, పంజాబ్‌కి కేజ్రీవాల్ ఏం చేశానని మలివాల్ ప్రశ్నించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం తర్వాత పంజాబ్ ఆప్ ప్రభుత్వంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ని మారుస్తారనే చర్చ నడుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు 30 మంది తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఇక బిభవ్ కుమార్ విషయానికి వస్తే, స్వాతి మలివాల్‌పై భౌతిక దాడి చేసింది ఇతడే. గతేడాది మేలో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన సందర్భంలో దాడి చేశాడు. ప్రస్తుతం ఇతడినే పంజాబ్ సీఎంకి ముఖ్య సలహాదారుగా నియమించారు. ఇతడికి Z+ భద్రత లభించడం పలువురిని ఆశ్చర్యపరిచింది.