సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే, అంతే మంచిది. ఒకవేళ ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు అలాంటి పరిస్థితే వచ్చిపడింది. ఈమెకు ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో అంశంపై స్పందిస్తూ వార్తల్లోకెక్కే స్వర భాస్కర్.. 2017లో వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలని వీర్ సావర్కర్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ఆమె ట్వీట్ చేసింది. అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. వీర్ సావర్కర్ అభిమానులు ఆమెపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు ఆ అంశం మీదే స్వర భాస్కర్ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది.
మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న స్వర భాస్కర్ నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపు లేఖ పంపారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత ఏమాత్రం సహించబోదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్‌కు కూడా ఓ బెదిరింపు లేఖ వచ్చిన సంగతి విదితమే!