NTV Telugu Site icon

Supreme Court: సంజయ్‌ రాయ్‌కు జీవితఖైదు.. నేడు విచారించనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్

Supreme Court

Supreme Court

Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌కి శిక్ష ఖరారైంది. కోల్‌కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. అయితే, ఈ కేసును ఈరోజు (జనవరి 22) మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. అయితే, మరోవైపు కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ జీవిత ఖైదు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టుకు వెళ్లింది. నిందితుడికి మరణశిక్ష విధించాలన్న అప్పీలుపై విచారణకు ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్‌ ఆసుపత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ తీసుకుని విచారణ చేసింది. దీంట్లో భాగంగా ప్రత్యేక కోర్టుకు తగిన సాక్ష్యాలను సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన విజువల్స్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Ration Cards: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి

ఇక, జీవిత ఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మాకు పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదని పేర్కొన్నారు. సరైన న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయిస్తామని వారు చెప్పారు. ఈ నేరంలో ఇతర భాగస్వాములను వదిలి పెట్టారు.. ఇది అత్యంత అరుదైన కేసు కాదా? డాక్టర్ విధి నిర్వహణలో అత్యాచారానికి, హత్యకు గురైంది అంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివెనక పెద్ద కుట్ర ఉందన్నారు.