Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదులో బయటపడిన శివలింగం వంటి నిర్మాణానికి ‘కార్బన్ డేటింగ్’ పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయసును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూపక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్ కు ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం విచారించేందుకు సుప్రీం అంగీకరించింది. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ తన వాదనలను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహా, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారణాసిలోని మసీదులో శివలింగంగా పేర్కొనబడిన కట్టడం వయస్సును నిర్ణయించాలని మే 12న హైకోర్టు ఆదేశించింది.
Read Also: Karnataka: డిప్యూటీ సీఎం దళితుడికి ఇవ్వకుంటే.. అధిష్టానానికి కాంగ్రెస్ లీడర్ వార్నింగ్..
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదం గత ఏడాది కాలంగా నడుస్తోంది. గతేడాది వారణాసి స్థానిక కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం వంటి నిర్మాణం బయటపడింది. ఆ తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. వారణాసి జిల్లా కోర్టు అక్టోబర్ 14న కార్బన్ డేటింగ్ తో సహా శాస్త్రీయ పరిశోధనకు అనుమతిని తిరస్కరించింది. దీనిపై హిందూ తరుపు న్యాయవాది అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 12న కార్బన్ డేటింగ్ పరీక్షకు అనుమతి ఇచ్చింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే చేయాలని ఆదేశించింది.
మసీదు కూడా కాశీవిశ్వనాథ కాంప్లెక్స్ లో భాగమే అని మసీదు గోడలపై దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. దీనికి మసీదు కమిటీ వ్యతిరేకించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదులో విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. అయితే గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. మసీదులో లభ్యమైన శివలింగ నిర్మాణం ఫౌంటెన్ అని ముస్లిం తరుపు వారు వాదిస్తున్నారు.