Supreme Court: అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘పైజామా దారం విప్పడం అత్యాచార ప్రయత్నం కిందకు వస్తుంది’’ అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టును తీవ్ర స్థాయిలో మందలించింది. ఒక అమ్మాయి రోమ్మును పట్టుకోవడం, ఆమె పైజామా దారాన్ని విప్పడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కాదని గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అలహాబాద్ హైకోర్టు తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చీ, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం లైంగిక నేరాల కేసులో నిర్ణయాలను చట్టపరమైన తార్కికం, సానుభూతితో చూడాలని పేర్కొంది. ‘‘వక్షస్థలం పట్టుకోవడం, పైజామా దారాన్ని లాగడం’’ అత్యాచార ప్రయత్నంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కేవలం రోమ్ము పట్టుకోవడం, పైజామా తాడును లాగడం అత్యాచారం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుని, ఫిబ్రవరి 10న సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతూ.. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద ఇద్దరు నిందితులపై అత్యాచారయత్నం అభియోగాలను తిరిగి మోపింది. ‘‘నిందితులు చేసిన ప్రయత్నం స్పష్టంగా అత్యాచారం కోసమే ఇలాంటి పనులు చేశారు’’ అని చెప్పింది.
కేసు ఏమిటి.. గతంలో హైకోర్టు తీర్పు:
2021 నవంబర్ 10న ఒక మహిళ, తన 14 ఏళ్ల కుమార్తెతో కలిసి ఇంటికి వస్తుండగా,
పక్క గ్రామానికి సంబంధించిన ముగ్గురు యువకులు బైక్‌పై కలిసి వచ్చి, లిఫ్ట్ ఇచ్చే పేరుతో వారిని ఆపారు. బాలికను బలవంతంగా కాలువ కిందకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆమె ప్యాంట్ నాడా లాగడం,బ్రెస్ట్ పట్టుకోవడం వంటి చర్యలు చేశారు. అయితే బాలిక కేకలు విన్న సమీపంలోని వ్యక్తులు రావడంతో, నిందితులు బాలికను వదిలేసి పారిపోయారు.
ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2025 మార్చి 17న ఇచ్చిన తీర్పులో.. బాలిక బ్రెస్ట్ పట్టుకోవడం, ఆమె పైజామా నాడా లాగడం రేప్ కాదని, రేప్ ముందు చేసే ప్రక్రియ మాత్రమే అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై విమర్శలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి తీర్పు చెప్పింది.
