ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియ నిర్వహిస్తోంది. అయితే చాలా మంది పేర్లు ‘‘సర్’’లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓటరు జాబితాలో పేరు లేకపోయినంతమాత్రాన భారత పౌరసత్వం కోల్పోయినట్లుకాదని స్పష్టం చేసింది. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వ్యక్తులను పౌరులు కాదని భావించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నట్లు వచ్చిన నివేదికలను సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది.
శుక్రవారం ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా సభ్యులుగా ఉన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించడాన్ని పౌరసత్వం కోల్పోయినట్లుగా పరిగణించరాదని, అలాంటి కారణంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నిరాకరించడం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం (ECI), పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
అయినా పౌరసత్వం నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేసింది. మే 27న ఇచ్చిన గత తీర్పును గుర్తుచేసిన సుప్రీంకోర్టు.. ఓటరు జాబితాను సిద్ధం చేయడం, సవరించడం ఎన్నికల సంఘం అధికార పరిధిలో ఉన్నప్పటికీ, ఎవరు భారత పౌరులు అనే విషయాన్ని తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేసింది. ‘‘చట్టపరంగా ఎలాంటి సందిగ్ధత లేదు. SIR ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన భారత పౌరసత్వం పోదు.’’ అని న్యాయస్థానం పేర్కొంది.
జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి మాట్లాడుతూ.. ట్రైబ్యునల్ ఒక వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండకూడదని తేల్చితే.. ఎన్నికల సంఘం ఆ విషయాన్ని పౌరసత్వ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాల్సిన బాధ్యత ఉందని వివరించారు. ఓటరు జాబితాలో పేరు చేర్చాలా, తొలగించాలా అనే అంశంపై ఎన్నికల సంఘం పరిమిత స్థాయిలో మాత్రమే పౌరసత్వానికి సంబంధించిన విచారణ చేయగలదని, కానీ ఒక వ్యక్తిని భారత పౌరుడు కాదని తుది నిర్ణయం తీసుకునే చట్టబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి లేదని ధర్మాసనం పేర్కొంది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ.. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించిన అనేక మందికి అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారికి రేషన్, నగదు బదిలీ, ఇతర సంక్షేమ పథకాల లబ్ధి నిలిపివేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు సుమారు 38 వేల అప్పీలు మాత్రమే పరిష్కారమయ్యాయని, ఇంకా 34 లక్షల అప్పీలు ట్రైబ్యునళ్ల ముందు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ‘‘అప్పీలు ఇంకా విచారణలో ఉన్నప్పుడు పౌరులను సంక్షేమ పథకాల నుంచి ఎలా దూరం చేస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించడం ఒక్కటే ఆధారంగా తీసుకుని ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), నగదు బదిలీ పథకాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నిరాకరించకూడదని మరోసారి సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

