Supreme Court set to hear pleas challenging Citizenship Amendment Act (CAA) on September 12: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)-2019కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 12న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడిన ధర్మాసనం ఈ అంశానికి వ్యతిరేకంగా నమోదైన 200కి పైగా పిటిషన్లను విచారించనుంది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో నిరసన, ఆందోళనలు జరిగాయి.
డిసెంబర్ 31,2014 నాటికి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రిస్టియన్ కమ్యూనిటీలకు కెందిన వారికి భారత పౌరసత్వాన్ని ఇచ్చే విధంగా సీఏఏ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారి తీసింది. సీఏఏను డిసెంబర్11, 2019న పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం 2019 డిసెంబర్ 12న నోటిఫై చేయబడింది. అయితే ఈ లోపే కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ చట్టం పక్కకు వెళ్లింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తం పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సెప్టెంబర్ 12, సోమవారం రోజున సుప్రీంకోర్టు విచారించనుంది.
Read Also: Sitaram Yechury: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం అవుతున్నాయి.. 2024లో బీజేపీ ఓడిపోతుంది.
పార్లమెంట్ ఆమోదించి నోటిఫై చేసినప్పటికీ.. ఈ చట్టానికి సంబంధించి రూల్స్ ఇంకా రూపొందించలేదు. దీంతో ఈ సీఏఏ బిల్లు కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ ఏడాది మే నెలలో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఓ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కోవిడ్ మహమ్మారి ముగిసిన తర్వాత ఈ చట్టం అమలులోకి వస్తుందని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని బీజేపీ వ్యాఖ్యలు చేస్తోంది. 2024 ఎన్నికల లోపు సీఏఏ చట్టం అమలులోకి వస్తుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని విపక్షపాలిత రాష్ట్రాలు సీఏఏను అనుమతించేది లేదని చెబుతున్నాయి. గతంలో సీఏఏపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీజేపీ సీఏఏను అమలు చేయాలని అనుకుంటే అది తన మృతదేహాంపై చేయాల్సి ఉంటుందని అన్నారు.
