Breaking News: లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పథకంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల ద్వారా కార్పొరేట్లు మరియు రాజకీయ పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాట్లకు సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఫిబ్రవరిలో, రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపేయాలని ఎస్‌బీఐని ఆదేశించింది.
రిటైర్డ్ జస్టిస్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు శుక్రవారం కోట్టేసింది. ‘‘చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాల ఆధారంగా అనుసరించాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం చట్టంలోని అందుబాటులో ఉన్న పరిష్కారాలు విఫమైనప్పుడు మాత్రమే కోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పింది.
Read Also: Breaking News: “ఎలక్టోరల్ బాండ్ స్కీమ్”పై దర్యాప్తు బృందం ఏర్పాటుకి నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు వారాల ముందు ఒక సంచలన తీర్పులో, రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని నిధులు ఓటర్ల పారదర్శకత హక్కును ఉల్లంఘించాయని కోర్టు పేర్కొంది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ మాట్లాడూతూ.. ఈకేసులో ప్రభుత్వాల ప్రమేయం ఉందని, అధికార పార్టీ, అగ్ర కార్పొరేట్ సంస్థల ప్రమేయం ఉందని, ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది సాధారణ అవినీతి కేసు కాదని, భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమై ఆర్థిక కుంభకోణాల్లో ఒకటని చెప్పారు. రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయిస్తే తప్పా, ఈ కేసులో విషయాలు వెలుగులోకి రావని చెప్పారు.
కోర్టు ఈ వాదనలు విన్నప్పటికీ సిట్ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. ‘‘మేము వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించాము. మేము పథకాన్ని రద్దు చేశాము. ఇప్పుడు సిట్ ఏమి దర్యాప్తు చేస్తుంది..? ’’ అని కోర్టు ప్రశ్నించింది. చట్టంలోని పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు మనం సిట్‌ని ఏర్పాటు చేయవచ్చా..? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.