Supreme Court: భర్తలు ఉద్యోగాలు కోల్పేయేలా భార్యలు ప్రవర్తిస్తుండటంపై సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక వివాదాల నేపథ్యంలో కొందరు మహిళలు భర్తలు పనిచేసే సంస్థలకు ఫిర్యాదు చేయడాన్ని అత్యున్నత కోర్టు తప్పుపట్టింది. ఇది చివరకు భర్తలు ఉద్యోగం కోల్పోయేలా చేస్తుందని, చివరకు భరణంపై ప్రభావం చూపొచ్చని వ్యాఖ్యానించింది. అస్సాంలో నమోదైన పరువునష్టం కేసును ఉత్తర్ ప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల ధర్మాసనం విచారణ చేసింది.
తన భర్తతో ఇప్పటికే ఘజియాబాద్‌లో పలు కేసులు నడుస్తున్నందున, పరువు నష్టం కేసును కూడా అక్కడికే బదిలీ చేయాలని మహిళ కోర్టును కోరింది. విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో చాలా మంది భార్యలు భర్త పనిచేసే సంస్థలకు ఫిర్యాదు చేయడం ఒక ధోరణిగా మారిందని అన్నారు. ఇలాంటి ఫిర్యాదుల వల్ల భర్త ఉద్యోగం కోల్పేయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విడాకులు కోరడం ఒక విషయం, కానీ జీవిత భాగస్వామి జీవనోపాధినే కోల్పోయేలా చేయడం మరింత తీవ్రమైన విషయం అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఈ కేసులో మహిళ, తన భర్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అయినప్పటికీ సేవా నియమాలకు విరుద్ధంగా వ్యక్తిగత వ్యాపారం నిర్వహిస్తుున్నారని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై భర్త స్నేహితుడు ఆమెపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.
మహిళ తరుఫు న్యాయవాది వాదిస్తూ.. ఆమె భర్త ముందుగా తప్పుడు ఫిర్యాదు చేశాడని, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెల్మెట్‌ను ఆమె, ఆమె సోదరుడు దొంగిలించారని ఆరోపించారని తెలిపారు. ఆ హెల్మెట్ వివరాలు తెలుసుకునేందుకే ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టుకు వివరించారు. అన్ని వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఈ కేసులో రాజీకి అవకాశం ఉందేమో అని పరిశీలించాలని సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపింది. అన్ని ఆరోపణలు విరమించుకుని వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని మహిళకు సూచించింది.

