కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా నడుస్తోంది. తాజాగా విజయపుర జిల్లాలోని ఇండి ప్రభుత్వ పీయూసీ కాలేజీకి తిలకం (సింధూరం) పెట్టుకుని వచ్చిన హిందూ విద్యార్థిని లెక్చరర్లు అడ్డుకున్నారు. తిలకం తీసేసి లోపలికి రావాలని ఆదేశించారు. దీనికి విద్యార్థి తిరస్కరించాడు. అయితే తిలకం ఉంటే కాలేజీ లోపలకు వచ్చేందుకు వీల్లేదని, ఇంటికి వెళ్లిపోవాలని లెక్చరర్లు స్పష్టం చేశారు. దీంతో భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. సింధూరం అనేది మతానికి సంబంధించినది కాదని, అదొక సంస్కృతి అని వాదించారు.
కాగా ఇటీవల హిజాబ్ వివాదం ఏపీని కూడా తాకిన విషయం తెలిసిందే. విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వేసుకొచ్చిన ఇద్దరు విద్యార్థినులను సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. హిజాబ్ ఎందుకు ధరించారని, దుస్తులు మార్చుకొని రావాలన్నారు. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం, మత పెద్దలతో మాట్లాడారు. కాలేజీ ప్రిన్సిపల్‌తో తల్లిదండ్రులు, పోలీసులు మాట్లాడిన తర్వాత విద్యార్థినులను కాలేజీ లోపలకు అనుమతించారు.