Viluppuram: తమిళనాడు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో విల్లుపురం జిల్లాలో వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లుపురం జిల్లాలోని ఇరు వేల్పట్టు ప్రాంతం తిరుచిరాపల్లి- చెన్నై రహదారిపై ప్రయాణికులు, స్దానికుల నిరసన ప్రదర్శన చేశారు. నిరసనను నిలిపి వేయాలని వారితో చర్చలు జరిపేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పొన్ముడి సహా ఇతర డీఎంకే నేతలపై పెద్ద ఎత్తున బురదను చల్లారు. వాహనంలో వెలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఇక, ఆందోళనకారుల బురద చల్లిన వెంటనే మంత్రిని కారులో ఎక్కించి పోలీసులు అక్కడి నుంచి పంపించారు. గత ఆరు గంటలుగా కనీసం నీళ్లు కూడా లేకుండా పడిగాపులు కాస్తున్నామని డీఎంకే నేతలపై వరద బాధితుల మండిపడ్డారు.
Read Also: Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్
కాగా, కోయంబత్తూరు- బెంగళూరుకు, సేలం నుంచి బెంగళూరుకు.. విల్లుపురం నుంచి బెంగళూరు- చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుంది. ఎనిమిది గంటలుగా ఆయా జాతీయ రహదారులపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వెహికిల్స్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఆహారాన్ని అందించాలంటూ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. గత మూడు రోజులుగా సేలం, విల్లుపురం బస్టాండ్ లు నీటిలోనే ఉండిపోయాయి. దీంతో పాటు వరదల కారణంగా నీట మునిగిపోయిన లోతట్టు కాలనీలకు ఇంకా పూర్తిస్థాయిలో సహాయక చర్యలు కొనసాగడం లేదు. ఒకటిన్నర రోజుగా వరదలోనే మూడు జిల్లాల్లోని వేలాది కుటుంబాలు ఉండిపోయాయి.