Site icon NTV Telugu

Stone Pelting: చిచ్చుపెట్టిన చికెన్‌..! రెండు వర్గాల మధ్య దాడులు

Stone Pelting

Stone Pelting

Stone Pelting: చికెన్‌ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.. పరస్పరం దాడులకు వరకు వెళ్లింది వ్యవహారం.. ఇంతకీ చికెన్‌ ఏంటి? రెండు వర్గాల మధ్య దాడులకు ఎందుకు దారితీసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది… సోమవారం రాత్రి అలీగఢ్​లోని సరాయ్​ సుల్తానీలో ఉన్న ఓ మాంసం దుకాణానికి కొందరు యువకులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు.. అయితే, ఆ సమయంలో చికెన్‌ విక్రయించే వ్యక్తి, ఆ యువకులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కాస్త గొడవకు దారితీసింది.. దీంతో, పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాయ్ సుల్తానీ చౌకీ సమీపంలోని జరిగిన రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణలో.. ఆకాష్, సిద్ధార్థ్, నరేష్ గౌతమ్ అనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. కొన్ని కార్ల అద్దాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also: Passenger Train: విశాఖలో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు..

మరోవైపు, రాళ్ల దాడి చాలాసేపు కొనసాగడంతో ఐజీ దీపక్‌కుమార్, డీఎం ఇంద్ర విక్రమ్ సింగ్, ఎస్‌ఎస్పీ కళానిధి నైతానీ, పీఏసీతోపాటు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌ల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గాయపడిన యువకుల బంధువులు, వారి మద్దతుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇక, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చికెన్ షాపును మూసివేయాలని డిమాండ్ చేశారు.. అయితే, గతంలో చాలా సార్లు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అకస్మాత్తుగా గుంపు మరోసారి రెచ్చిపోయి కౌంటర్‌ను ధ్వంసం చేశారని.. ఇతర వర్గాలకు చెందిన గుంపు సుల్తాన్ కీ సరాయ్ వీధి నుండి రాళ్లు రువ్వడం ప్రారంభించిందని చెబుతున్నారు.. అయితే, మరోసారి పోలీసుల ముందే ఘర్షణ చోటు చేసుకుంది.. మళ్లీ రాళ్ల దాడి జరిగింది. ఎలాగోలా ఇరువర్గాలను మళ్లీ శాంతింపజేశారు. ఐజీ దీపక్‌కుమార్ మైక్‌ని చేతిలోకి తీసుకుని వీధిలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఎస్పీ కళానిధి నైతానీ, ఐజీ దీపక్‌కుమార్‌లు ఫిర్యాదు మేరకు చర్యలకు ఉపక్రమించారు.

Exit mobile version