Karnataka Ministers: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్డీ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ప్రభుత్వాలు మారిన తరువాత వచ్చే కొత్త ప్రభుత్వాలు మంత్రులు, ముఖ్యమంత్రుల వాహనాలను మార్చుకోవడం సర్వసాధారణం. ఇపుడు కర్ణాటకలో కూడా బీజేపీ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున మంత్రులందరికీ కొత్తగా కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌లో ఉన్న 33 మందికి కొత్త కార్లను కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నిధులను సైతం కేటాయించింది. అత్యాధునికమైన కొత్త కార్లను కొనుగోలు చేయనుంది.
Read Also: Riti Saha Case: విద్యార్థిని రీతి సాహ కేసులో కొత్త ట్విస్ట్.. ఏపీ కోర్టుకు తండ్రి సుఖదేవ్
కర్ణాటక రాష్ట్ర మంత్రులు కొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లను అందుకోనున్నారు. ఒక్కో మంత్రికి ఒకటి చొప్పున 33 కార్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.9 కోట్లు కేటాయించింది.
ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు అయిన టయోటా నుండి ఇటీవల విడుదల చేసిన హైబ్రిడ్ హైక్రాస్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ప్రముఖ ఎమ్‌పివి ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్‌ను సంస్థ ఆగస్ట్ 29న అధికారికంగా విడుదల చేసింది. ఒక్కో కారు ఖరీదు రూ.30 లక్షలు. ప్రభుత్వం టయోటా కిర్లోస్కర్ నుండి నేరుగా కార్లను కొనుగోలు చేయనుంది. ప్రత్యక్ష కొనుగోలును సులభతరం చేయడానికి, వారు 4(G) మినహాయింపును మంజూరు చేశారు. అయితే మంత్రుల కోసం హైబ్రిడ్ కార్లపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై బిజెపి విమర్శలు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నానని.. రాష్ట్రం ఆర్థిక, ప్రకృతి వైపరీత్యాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. కాబట్టి ఇలాంటి ఆర్థికపరమైన భారాలుపడే నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాలన్నారు. కార్ల కొనుగోలుకు ఉపయోగించే సొమ్మును ప్రజల సంక్షేమానికి వినియోగించాలని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా ప్రజలను పట్టించుకోవడం లేదని.. ఇవన్నీ ఫ్యాషన్‌గా మారిపోయాయని విమర్శించారు.