Famous Poet Srirangam Srinivas Rao (SRI SRI) Daughter Mala has been Appointed as a Judge of the Madras High Court.
తెలుగు సాహిత్య ప్రపంచాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తెకు కీలక పదవి దక్కింది. శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో మాలా ప్రాక్టీసు చేస్తున్నారు. మాలా 1989లో మద్రా్‌స-పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో నమోదయ్యారు. అయితే న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా వీరిలో మాలా, ఎస్.సౌందర్‌ల పేర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
శ్రీశ్రీ-సరోజా దంపతుల ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అయితే మాలా చిన్నవారు. ఈమె మద్రాస్ లా కళాశాల నుంచి డిగ్రీ పొందారు. గురువారం కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా తొమ్మిది మందిని దేశంలోని ఐదు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించగా, వీరిలో ఆరుగురు న్యాయవాదులు, మిగిలిన ముగ్గురు జ్యుడీషియల్ అధికారులని న్యాయమంత్రిత్వశాఖ గురువారం ట్వీట్ చేసింది. మాలా 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.