Spy Satellite: జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్ర దాడి యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. అమాయకులైన టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా అనుంబంధ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ దాడికి తెగబడింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పో్యారు. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలకు దిగింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది, పాకిస్థానీలకు వీసాలను నిలిపేసింది, దౌత్య సంబంధాలను తగ్గించింది. మరోవైపు, పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలకు దిగింది. వాణిజ్యాన్ని రద్దు చేసింది, భారత విమానాలకు గగనతల అనుమతిని నిరాకరించింది. మరోవైపు, సరిహద్దుల్లో పాక్ సైన్యం హడావుడి పెరిగింది.
ఇదిలా ఉంటే, భారత అంతరిక్ష సంస్థ ‘‘ఇస్రో‘‘ స్పై శాటిలైట్ ప్రయోగాన్ని మరింత వేగవంతం చేసింది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా వేయడానికి సాయపడే ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని స్పీడ్ అప్ చేసినట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని వారాల్లో ప్రత్యేక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ శాటిలైట్ ద్వారా రాత్రి, పగలు రెండు సమయాల్లో ఇమేజింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేఘాలు అడ్డుగా ఉన్నప్పటికీ స్పష్టమైన ఫోటోలను తీసే సత్తా దీనికి ఉంది.
Read Also: Pawan Kalyan: ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరేయాలి.. మనకి కనికరం ఎక్కువైపోయింది!
ఇస్రో అత్యాధునిక EOS-09 ఉపగ్రహాన్ని మోసుకెళ్ళే PSLV-C61 మిషన్‌ను ప్రయోగిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. “సి-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్‌తో అమర్చబడిన EOS-09, పగలు లేదా రాత్రి అన్ని వాతావరణ పరిస్థితులలో భూమి ఉపరితలం యొక్క అధిక-రిజల్యూషన్ చిత్రాలను సంగ్రహించగలదు” ఆయన చెప్పారు. భారతదేశానికి అంతరిక్షంలో 50కి పైగా శాటిలైట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వీటికి తోడవ్వనుంది.
ఇప్పటికే భారత అధునాతన కార్టోసాట్-3 శాటిలైట్ లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో తిరుగుతూ, అరమీటర్ కన్నా తక్కువ రిజల్యూషన్‌తో చిత్రాలను తీయగలదు. కానీ ఈ ఉపగ్రహం రాత్రి వేళల్లో పనిచేయలేదు. దీంతో శత్రువులు తమ ఆయుధాలు రాత్రి వేళల్లో తరలించగలరు. కానీ హై-ఎండ్ EOS-9 నుంచి శత్రువులు రాత్రి వేళల్లో కూడా తప్పించుకోలేరు.