Ram Temple: అయోధ్యలో శ్రీరామ ఆలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతున్నాయి. ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు మొత్తం 7000 మందికి పైగా ముఖ్య అతిథులు హాజరవుతున్నారు. లాల్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
మరోవైపు రాముడికి కానుకలుగా పంపిన పలు వస్తువులు అయోధ్యకు చేరుకోబోతున్నాయి. ఇందులో 2100 కిలోల గంట, 108 అడుగుల పొడవాటి అగర్‌బత్తి, 1,100కిలోల భారీ దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, 8 దేశాల్లో ఏకకాలంలో సమాయాన్ని సూచించే భారీ గడియారం ఉన్నాయి. జనవరి 22 రామమందిర వేడుకకు ముందే ఈ కానుకలు అయోధ్యకు చేరుకోబోతున్నాయి.
ఒక్క మనదేశం నుంచే కాదు నేపాల్, శ్రీలంకల నుంచి కూడా కానుకలు వస్తు్న్నాయి. నేపాల్ లోని జనక్‌పూర్ లోని సీతా జన్మస్థానం నుంచి శ్రీరాముడి కోసం 3000 కంటే ఎక్కువ కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి బూట్లు, ఆభరణాలు, బట్టలు, ఇతర బహుమతులు ఉన్నాయి. ఈ వారం నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ రామజానకి ఆలయం నుండి అయోధ్యకు దాదాపు 30 వాహనాల కాన్వాయ్ చేరుకున్నాయి. శ్రీలంకలోని ‘అశోకా వాటిక’(సీతను రావణుడు బందీ చేసిన స్థలం) నుంచి ప్రత్యేకమైన రాయిని అయోధ్యకు తీసుకువచ్చారు.
Read Also: Jeddah Tower: బుర్జ్ ఖలీఫా స్థానంలో “జెడ్డా టవర్”.. దీని ప్రత్యేకతలు ఇవే..
రామ్ లాల్లా ప్రాణ్‌ప్రతిష్ట కోసం అహ్మదాబాద్ నుంచి 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంబం, ఇతర చిన్న ఆరు స్తంభాలను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ జెండా ఊపి గత వారం ప్రారంభించారు. గుజరాత్ దరియాపూర్‌లోని ఆల్ ఇండియా దబ్గర్ సమాజ్ రూపొందించిన నగారు (టెంపుల్ డ్రమ్)ని కూడా పంపింది. బంగారు రేకుతో చేసిన 56 అంగుళాల నగారుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. 10 అడుగుల ఎత్తు, 4.6 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో 400 కేజీల బరువున్న తాళం, తాళం చెవిని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ శ్రీరాముడి కోసం తయారు చేశారు. ఇదే ప్రపంచంలో అతిపెద్ద తాళం.
రామాలయ సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం 7000 కిలోల ‘‘రామ్ హల్వా’’ని తయారు చేస్తున్నట్లు చెఫ్ విష్ణు మనోహర్ తెలిపారు. మథురలోని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ అయోధ్యకు ‘యాగం’ కోసం 200 కిలోల లడ్డూను నైవేద్యంగా పంపడానికి సన్నాహాలు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష శ్రీవారి లడ్డూలను భక్తులకు అందించనుంది.