Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, తన కూతురు ప్రియాంకాగా గాంధీ కోసం ప్రచారం చేయబోతున్నారు. వయనాడ్ లోక్‌సభా స్థానం నుంచి ప్రియాంకా అరంగ్రేటం చేయబోతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత, వయనాడ్ లోక్‌సభా స్థానానికి రాజీనామా చేయడంతో మళ్లీ అక్కడ బై ఎలక్షన్ జరగబోతున్నాయి. కేరళలోని పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలతో పాటు వయనాడ్ లోక్‌సభా స్థానానికి నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
చాలా ఏళ్ల తర్వాత సోనియా గాంధీ కేరళకు వెళ్తున్నారు. మంగళవారం జరగబోయే రోడ్ షోలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొంటున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత.. కేరళ కాంగ్రెస్ ప్రియాంకాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించింది. ఆమె వయనాడ్ నుంచి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) అభ్యర్థిగా ప్రకటించింది.
Read Also: AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి కంచుకోటగా ఉన్న వయనాడ్ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ 5 లక్షలకు పైగా మెజారిటీలో గెలుస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అలప్పుజా ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ ప్రచారాన్ని సమన్వయం చేయనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో 4,31,770 ఓట్లతో పోలిస్తే 2024లో రాహుల్ గాంధీ మెజారిటీ తగ్గింది.
ఇదిలా ఉంటే, ప్రియాంకాగాంధీపై పోటీ చేయబోతున్న అభ్యర్థుల్ని బీజేపీ, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)లు ప్రకటించాయి. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకేరిని రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.