Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఆమె వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే హాజరుకావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరుకాలేకపోయారు. ఇదే కేసులో ఆమె తనయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ దాదాపు 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.
ఈ చర్య రాజకీయ ప్రతికారమేనని కాంగ్రెస్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఇదే కేసులో గత నెలలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిన రీతిలోనే ఇప్పుడూ చేయాలని పార్టీ నిర్ణయించింది. సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అగ్రనేతలంతా దీని నిమిత్తం గురువారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఎంపీలు సహా నేతలంతా ఈడీ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లనున్నారు. రాజ్‌భవన్ వెలుపల దిల్లీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.