CJP Protest: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు పలికారు. గురుగ్రామ్‌లోని మెడాంతా ఆస్పత్రిలో గురువారం రాత్రి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, లేహ్-లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన దీక్ష విరమించారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ స్వయంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
వాంగ్‌చుక్ తన ప్రకటనలో, పలువురు అంశాలపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిగిన అనంతరం దీక్షను విరమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు తనను కలిసి లేదా లేఖల ద్వారా దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. దీక్ష విరమించడానికి దారితీసిన షరతులు, చర్చల వివరాలను త్వరలో ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడిస్తానని వాంగ్‌చుక్ తెలిపారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఎక్కడా హింసకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై స్పందించారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. త్వరలోనే పూర్వపు ఆరోగ్య స్థితికి చేరుకోవాలని కోరుతూ, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కూడా వాంగ్‌చుక్ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశ మనస్సాక్షిని మేల్కొల్పేందుకు వాంగ్‌చుక్ చేసిన త్యాగం ఎంతో గొప్పదని కొనియాడారు. అయితే ఉద్యమం మాత్రం ఇక్కడితో ముగియదని స్పష్టం చేశారు.
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసనలు కొనసాగుతాయని దిప్కే తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా శుక్రవారం శాంతియుత నిరసనల్లో ప్రజలు పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. నీట్ – యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, పోటీ పరీక్షల పారదర్శకత, విశ్వసనీయతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా కూడా ఒత్తిడి పెరుగుతున్న వేళ, వాంగ్‌చుక్ దీక్ష ముగిసినా ఉద్యమం మాత్రం కొనసాగుతుందని CJP స్పష్టం చేసింది.

