పంజాబ్ లో ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే ఫలితాలు వస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ సోమ్‌నాథ్ భారతి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మార్చి 10న పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ఉత్తరాఖాండ్, గోవా రాష్ట్రాలలో కూడా మెరుగైన ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని ఆయన వెల్లడించారు. మా పార్టీ కార్యకర్తల కృషి వల్ల మెరుగైన ఫలితాలు రాబోతున్నాయని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ ఆమ్ఆద్మీపార్టీ కాబోతోందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కనుమరుగవుతున్న పార్టీ అని, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ అభివృద్ధి మోడల్ లో పంజాబ్ ని కూడా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. ఢిల్లీ పూర్తిగా రాష్ట్రం కాదు కాబట్టి కొన్ని పనులు చేయలేకపోతున్నాం కానీ పంజాబ్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్నీ చేసి చూపిస్తామన్నారు.