Site icon NTV Telugu

Shashi Tharoor: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల భేటీకి శశి థరూర్ డుమ్మా.. వరసగా మూడోసారి..

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి శశి థరూర్ మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం వరసగా ఇది మూడోసారి. పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు థరూర్ పదే పదే హాజరవ్వకపోవడం కాంగ్రెస్‌లో అసంతృప్తిని పెంచుతోంది. ముందస్తు సమావేశాలు, ప్రయాణాలు ఉన్నాయని థరూర్ చెప్పినప్పటికీ, కీలకమైన పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఎంపీల ఐక్యతను ప్రతిబింబించే సమావేశానికి రాకపోవడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్‌లో శశిథరూర్‌తో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

Read Also: Nitish Kumar Reddy: నితీశ్‌ కుమార్‌ రెడ్డి హ్యాట్రిక్.. అయినా ఆంధ్రకు నిరాశే!

ఇటీవల కాలంలో, బీజేపీకి శశిథరూర్ దగ్గరవుతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కూడా హస్తం పార్టీకి రుచించడం లేదు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ మీటింగ్‌కు చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీతో పాటు థరూర్ కూడా గైర్హాజరు అయ్యారు. ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి థరూర్ నిన్న రాత్రి కోల్‌కతా వెళ్లారు, అంటే ఆయన సమావేశానికి సమయానికి ఢిల్లీకి తిరిగి రాకపోవచ్చని తెలుస్తోంది.

దీనికి ముందు నవంబర్ 30న జరిగిన కాంగ్రెస్ స్ట్రాటజిక్ టీమ్ సమావేశాన్ని తాను ఉద్దేశపూర్వకంగా దాటవేయలేదని థరూర్ స్పష్టం చేసిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. ఈ సమావేశం జరిగిన సమయంలో తాను కేరళకు విమానంలో వెళ్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పై జరిగిన సమావేశానికి అనారోగ్య కారణాలు చూపుతూ థరూర్ గైర్హాజరయ్యారు. ఇటీవల, పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుకు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకుండా శశిథరూర్‌కు ఆహ్వానం అందడం కూడా కాంగ్రెస్‌లో కోపానికి కారణమవుతోంది.

Exit mobile version