Shashi Tharoor: బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక అవ్వడంపై.. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అనూహ్యంగా స్పందించారు. భారత సంతతికి చెందిన ఒక హిందువు బ్రిటన్‌కి ప్రధాని కావడం ఒక పాఠం వంటిదని సూచించిన ఆయన.. మన దేశంలో హిందువు, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులు కాకుండా ఇతరులు ప్రధాని అవ్వగలరా? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ ప్రోద్బలిత రాజకీయాలు బాగా నడుస్తున్న ప్రస్తుత కాలంలో.. అలాంటిది సాధ్యమవుతుందా? అలా జరుగుతుందని ఊహించగలమా? అని నిలదీశారు.
‘‘మన భారత ఉపఖండంలో ఎన్నో మతాలు జన్మించాయి. ఆ మతాలను హిందుత్వ భావజాలం సమానంగానే చూస్తుంది. కానీ.. హిందుత్వ వాదులే ఇతరుల్ని సమానంగా చూడలేకపోతున్నారు’’ అని శశి థరూర్ చురకలు అంటించారు. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మన హిందువులు, హిందూ మతాన్ని ఉద్దేశించి ‘‘అటవిక ప్రజలు, అటవిక మతం’’ అని చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ బ్రిటన్ దేశానికే హిందుత్వవాది అయిన రిషీ సునాక్ ప్రధాని అయ్యాడన్నారు. మరి.. అదే రీతిలో బీజేపీ ఒక క్రైస్తవుడ్ని గానీ, ముస్లింని గానీ భారత ప్రధాని పీఠంపై కూర్చోబెడుతుందా? అని ప్రశ్నించారు. అలాగే.. క్రిస్టియన్‌గా ముద్రపడిన ఇటలీ దేశస్తురాలు సోనియా గాంధీ ప్రధాని అయితే, తాను శిరోముండనం చేయించుకుంటానని సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
ఇదిలావుండగా.. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం శశి థరూర్ పోటీ పడిన విషయం తెలిసిందే! అయితే.. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఆయన ఘోర పరాజయం చవిచూశారు. గాంధీ కుటుంబంతో పాటు సీనియర్ల సపోర్ట్ ఉండటంతో.. ఖర్గే భారీ మోజారిటీతో ఈ ఎన్నికల్లో గెలిచారు.
