డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట కలిగింది. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ గురువారం నాడు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. 21 రోజులుగా ఆర్యన్ ఖాన్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్నిరోజుల పాటు జైలులో ఉండటం అటు బాలీవుడ్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాగానే మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో తాము బెయిల్ ఇవ్వలేమని, అది తమ పరిధిలో లేదని మెజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది.
Read Also: రికార్డు అంటే ఇదే.. గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పలేదు
దీంతో మరుసటి రోజే షారుఖ్ ఫ్యామిలీ బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. గత మూడు రోజులుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. అతడి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. తమ క్లయింట్ అతిథిగానే క్రూయిజ్‌కు వెళ్లాడని.. అతడి వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని ఆయన కోర్టుకు చెప్పుకొచ్చారు. ఆర్యన్ ఖాన్ వద్ద అసలు ఏమీ దొరకకున్నా అతడి పక్కన ఉన్న వ్యక్తి వద్ద దొరికితే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో న్యాయస్థానం గుర్తించాలని కోరారు. అయితే ఎన్సీబీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరఫు లాయర్ వాదిస్తున్నారని.. కానీ ఈ కేసులో ఆర్యన్ చాలా కీలకమైన వ్యక్తి అని వాదించారు. ఆర్యన్ ఖాన్ గత కొన్నేళ్లుగా మాదకద్రవ్యాలు స్వీకరిస్తున్నాడని, అతడి వాట్సాప్ చాటింగ్‌లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు దొరికాయన్నారు. స్నేహితుడి దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఆర్యన్‌కు ముందే తెలుసన్నారు. వాళ్లిద్దరూ ఏం చేసినా కలిసే చేస్తారని.. వారి వాట్సాప్ చాటింగులు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాన్ మర్చంట్, మున్ మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.