Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామా చేయడం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ రోజు ఎన్సీపీ కోర్ కమిటీ ముంబైలో భేటీ అయింది. అయితే శరద్ పవారే ఎన్సీపీ అధినేతగా కొనసాగాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మరికొంత కాలం ఆయనే అధ్యక్షుడిగా ఉండాలని నేతలంతా కోరుకున్నారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆయన రాజీనామా తర్వాత క్యాడర్ లో, నాయకుల్లో భావోద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయనకు మద్దతుగా పలువురు కీలక నేతలు, ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధ పడ్డారు. తాజాగా రాజీనామా తిరస్కరించడంతో ఎన్సీపీ నేతల్లో సంబరాలు మొదలయ్యాయి.
Read Also: S Jaishankar: అది జైశంకర్ అంటే.. పాకిస్తాన్ మంత్రి ముందే ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్..
సమావేశం అనంతరం ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. శరద్ పవార్ నిర్ణయంతో తామంతా షాక్ లో ఉన్నామని, ఆయన అలాంటి నిర్ణయం ప్రకటిస్తారని తెలియదని, ఆయన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఆయన కమిటీని నిర్ణయించారు, నాతో సహా అందరు నేతలు ఆయన రాజీనామాను తిరస్కరించారని వెల్లడించారు. ఆయన సేవలు ప్రజలు, దేశానికి అవసరం అని ప్రపుల్ పటేల్ అన్నారు. ప్రజలే కాదు ఇతర పార్టీల నాయకులు కూడా ఆయన అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. కమిటీ ఆయన రాజీనామాను తిరస్కరించిందని, ఆయనే ఎన్సీపీ నేతగా కొనసాగాలని కోరుకుటుందని చెప్పారు.
82 ఏళ్ల శరద్ పవార్ మూడు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు సమావేశంలో కూతురు సుప్రియా సూలే, మరో కీలక నేత అజిత్ పవార్, ఎన్సీపీ వైస్ చైర్మన్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో శరద్ పవార్ వారసత్వాన్ని ఆమె కూతురు సుప్రియా సూలే తీసుకుంటారని, మరో నేత అజిత్ పవార్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని అంతా అనుకున్నారు.
