NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..

  • మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు..
  • విలీనం దిశగా ఎన్సీపీ వర్గాలు..
  • విలీనం తర్వాత ఎన్డీయే కూటమిలోకి శరద్ పవార్..
Ncp

Ncp

NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ వర్గం, సునేత్రా పవార్ ఎన్సీపీ వర్గం కలిసిపోయే అవకావాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ రెండు వర్గాల విలీనం కావాలని బీజేపీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరవెనర బీజేపీ వేగంగా ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ వర్గాన్ని ప్రత్యేక పార్టీగా గుర్తించి ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడం బీజేపీకి ఇష్టం లేదని సమాచారం. దీని వల్లే ముందు రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోవాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) వర్గాన్ని బీజేపీలో విలీనం చేసుకునే ఆలోచన లేదని సమాచారం.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ, శివసేన పార్టీల చీలిక తర్వాత బీజేపీ బలీయమైన శక్తిగా మారింది. ఇదే సమయంలో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీని ఎన్డీయేలో చేర్చుకుంటే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని దెబ్బతీసినట్లు అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే సమయంలో రెండు ఎన్సీపీ వర్గాలు కలిస్తే రెండు వర్గాలకు ఒక్కో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడాన్ని కమలం పార్టీ పరిశీలిస్తోంది.

ఇదిలా ఉంటే, ఎన్డీయే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ‘‘డీలిమిటేషన్ బిల్లు’’ కోసం కసరత్తు చేస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. ఆ సంఖ్యా బలం కోసం వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం శరద్ పవార్ ఎన్సీపీకి 8 మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. ఈ మద్దతు ఎన్డీయే కూటమికి ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు బీజేపీకి బిల్లు విషయంలో మద్దతు ఇస్తామంటూ సుప్రియా సూలే హింట్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెరిగితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ శరద్ పవార్ కుమార్తె చెప్పడం గమనార్హం.

మరోవైపు, మహారాష్ట్రలో రహస్య భేటీలు జరుగుతున్నాయి. శరద్ పవార్ ఇటీవల డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను కలిశారు. ఎన్సీపీ రెండు వర్గాల నేతలు కూడా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ కూడా ఫడ్నవీస్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో నాయకత్వ పోటీ పెరిగింది.