NTV Telugu Site icon

NCP: అజిత్ పవార్‌కి చెక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్..

Ncp

Ncp

NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శనివారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు. సుప్రియా సూలే, శరద్ పవార్ కుమార్తె, ప్రస్తుతం ఈమె బారామతి నుంచి ఎంపీగా ఉన్నారు. పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు. 1999లో శరద్ పవార్, పీఏ సంగ్మా కలిసి ఎన్సీపీ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం సుప్రియాసూలేకి మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, మహిళా యువత, లోక్‌సభ సమన్వయం బాధ్యతలు అప్పగించగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా బాధ్యతలను ప్రఫుల్ పటేల్ చూసుకుంటారు.

ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తట్కరేకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ శాఖల బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఎన్సీపీ అధినేతగా నంద శాస్త్రిని నియమించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత సుప్రియా సూలే మాట్లాడుతూ.. పార్టీకి తాను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. శరద్ పవార్ తమ్ముడి కొడుకు అజిత్ పవార్ సమక్షంలోనే ఈ ప్రకటన వెలువడింది. ఎన్సీపీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్ కు చెక్ పెట్టేలా శరద్ పవార్ చాణక్యం ప్రదర్శించారు.

Read Also: Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్యల నిశ్చితార్థ వేడుకలో మెగా ఫ్యామిలీ

గత నెలలో ఎన్సీపీ పార్టీలో హైడ్రామా నడించింది. పార్టీ అధ్యక్షుడిగా తాను రాజీనామా చేస్తున్నానని శరద్ పవార్ ప్రకటించారు. అయితే పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ సమావేశంలో శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మాణం చేశారు. దీంతో ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా శరద్ పవార్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పార్టీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన నేపథ్యంలో గతంలో శరద్ పవార్ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అజిత్ పవార్, బీజేపీతో చేతులు కలిపారని విమర్శలు కూడా వచ్చాయి.

అయితే అజిత్ పవార్ కు చెక్ పెట్టేవిధంగా పార్టీలో తన తర్వాత కీలక నేతగా సుప్రియా సూలే ఉంటుందని శరద్ పవార్ చెప్పకనే చెప్పారు. మరోవైపు శరద్ పవార్, అజిత్ పవార్ కు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అజిత్ పవార్ ఈ ప్రకటనతో కలత చెందలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై ఆయన మహారాష్ట్ర బాధ్యతలు చూస్తారని చెబుతున్నారు.

Show comments