NTV Telugu Site icon

Bombay HC: ‘‘సిగ్గుమాలిన చర్య’’.. అత్తపై అల్లుడి అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు..

Bombay Hc

Bombay Hc

Bombay HC: తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది సిగ్గుమాలిన చర్య’’ అని, తల్లిలాంటి మహిళలపై ఇలాంటి ఘటనకు పాల్పడిన నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఏ సనప్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ.. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం వ్యక్తికి విధించిన శిక్షను సమర్థించింది.

డిసెంబర్ 2018లో తన 55 ఏళ్ల అత్తగారిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి సెషన్స్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ 2022లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని దోషి హైకోర్టులో సవాల్ చేశాడు. తన అల్లుడు, కూతురు విడిగా ఉంటున్నారని, ఇద్దరు మనవళ్లు తండ్రి వద్దే ఉంటున్నారని బాధిత మహిళ కోర్టు చెప్పింది.

Read Also: Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్

ఘటన జరిగిన రోజున, నిందితుడు తన అత్త వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. తన భార్యను తనతో కలపాలని ఆమెను సహాయం చేయాలని కోరాడు. నిందితుడి బలవంతం మేరకు బాధితురాలు అతడితో కలిసి అతడి ఇంటికి వెళ్లింది. నిందితుడు తాగి వచ్చి ఆమెపై మూడుసార్లు అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని తన కుమార్తె కు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి తన అప్పీల్‌లో తనను తప్పుడు అత్యాచార కేసులో ఇరికించారని, ఇది ఏకాభిప్రాయం మేరకు జరిగిన లైంగిక సంబంధమని పేర్కొన్నాడు. అయితే, కోర్టు వాదనలను అంగీకరించడానికి నిరాకరించింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బాధితురాలి వయసు 55 ఏళ్లు, తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆమె క్యారెక్టర్‌పై ఎలాంటి మచ్చను తీసుకురాదని చెప్పింది.

‘‘ఒక వేళ ఇది ఏకాభిప్రాయ చర్య అయితే, ఆమె పోలీసుల వద్ద ఫిర్యాదు చేసేది కాదు. ఏకాభిప్రాయ చర్య అయితే ఈ విషయాన్ని తన కుమార్తెకు వెల్లడించదు.’’ అని కోర్టు పేర్కొంది. తన అల్లుడు ఇలాంటి నీచమైన పనికి పాల్పడతాడని ఆ మహిళ ఊహించలేదని ధర్మాసనం పేర్కొంది. తన సొంత తల్లి వయసు ఉన్న అత్తగారిపై అవమానకరమైన చర్యకు పాల్పడిన నిందితుడు స్త్రీతత్వాన్ని అపవిత్రం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Show comments