Jammu Kashmir: కాశ్మీర్ సమస్యపై డ్రాగన్ కంట్రీ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, ఆర్టికల్ 370ని రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే ఈ తీర్పు తర్వాతి రోజే చైనా కామెంట్స్ చేసింది.
Read Also: Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ.. తొలిసారి ఎమ్మెల్యేని వరించిన అత్యున్నత పదవి..
కాశ్మీర్ సమస్యను భారత్-పాకిస్తాన్ దేశాలు చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని మంగళవారం సూచించింది. కాశ్మీర్ సమస్యపై చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ చెప్పారు. ఓ పాకిస్తానీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరు దేశాల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదమని, యూఎన్ చార్టర్, యూఎన్ఎస్సీ తీర్మానాలకు, సంబంధిత ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని అన్నారు. మరోవైపు దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు తీర్పును ‘‘చట్టపరమైన విలువ లేని’’ తీర్పుగా అభివర్ణించింది.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఏకగ్రీవంగా సమర్థించింది. రాష్ట్ర హోదాను “త్వరగా” పునరుద్ధరించాలని, అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు, కేంద్రాన్ని ఆదేశించింది.