Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్

  • భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది
  • పెట్టుబడులకు స్వర్గధామం
  • భారత్ విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
Sergio Gor

Sergio Gor

భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ అన్నారు. ఢిల్లీలో సెర్గియా గోర్ మాట్లాడుతూ.. “ప్రతి వారం కొంతమంది మా ఎంబసీకి వచ్చి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా? అక్కడ భాగస్వామ్య అవకాశాలు ఉన్నాయా?’ అని అడుగుతుంటారు. వారికి మా సమాధానం ‘అవును’ అనే సమాధానం చెబుతుంటా. ప్రపంచంలోని ప్రతి దేశానికి మేము ఈ సమాధానం ఇవ్వం. భారత్‌లో అద్భుతమైన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వాటికి స్వాగతం ఉంది. భారీ టెక్ కంపెనీలకు అనుకూలంగా నిబంధనలను మార్చి.. సరళీకృతం చేసిన ముందుచూపు గల ప్రభుత్వం భారత్‌లో ఉంది. అమెరికాలో ఇప్పటికే విజయవంతమైన టెక్ సంస్థలు ఇప్పుడు భారత్ వంటి విశ్వసనీయ ప్రాంతాల్లో విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి” అని పేర్కొన్నారు.

‘‘అధ్యక్షుడు ట్రంప్ దాదాపు ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా ముందుగా పరిశీలించిన అంశాల్లో ఒకటి.. ప్రపంచం ఏ దిశగా సాగుతోంది అన్నదే. చాలా కాలంగా ప్రపంచ శక్తి కేంద్రాలు పాతబడ్డ ప్రాంతాలకే పరిమితమైపోయాయి. అయితే ఈ ప్రభుత్వం కొత్త శక్తి కేంద్రాలను గుర్తించే ప్రయత్నం చేసింది. నా దృష్టిలో.. అధ్యక్షుడు ట్రంప్ దృష్టిలో.. అమెరికా ప్రభుత్వ దృష్టిలో.. భారత్ ప్రాధాన్యం ఇప్పుడే ఉంది. అది గతంలో కాదు. పాత ఆలోచనల్లో చిక్కుకుపోలేదు. భారత్‌లో ఉన్న అపార సామర్థ్యాన్ని మేము గుర్తించాం. భారత్ ఆర్థికంగానే కాదు. వ్యూహాత్మకంగానూ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోందని మేము చూస్తున్నాం. అందుకే భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు.

×
×
Ad

“ప్రపంచ శక్తి సమీకరణాలను కీలక, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు పూర్తిగా మార్చేస్తున్న ఈ నిర్ణాయక సమయంలో మనం ఉన్నాం. ఈ మార్పుకు నాయకత్వం వహించేందుకు మన రెండు దేశాల భాగస్వామ్యానికి మించిన శక్తివంతమైన సంబంధం మరొకటి లేదని నేను నమ్ముతున్నాను. ఇదే సమయంలో భారత్-అమెరికా సంబంధాలను 21వ శతాబ్దంలోని అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామ్యంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఈ భాగస్వామ్యం మన రెండు దేశాలకు, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించేదిగా ఉండాలి” అని వెల్లడించారు.