NTV Telugu Site icon

Lok sabha: నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. హాట్‌హాట్‌గా సాగే అవకాశం

Loksabha

Loksabha

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

రెండో విడత బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగేటట్లు కనిపిస్తు్న్నాయి. ఇందుకోసం ప్రతిపక్షాలు పోరాటానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విపక్షాల ఎదురుదాడిని ఎదుర్కొనేందుకు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే మణిపూర్, జమ్మూకాశ్మీర్ భద్రతపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. మణిపూర్‌లో జరిగిన అల్లర్లు, ఘర్షణలు, హింస, తదితర అంశాలపై హస్తం పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

ఇదిలా ఉంటే ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన వక్ఫ్‌ బిల్లును ఆమోదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వక్ఫ్‌ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇప్పటికే నివేదిక అందజేసింది. అలాగే మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్‌ ఆమోదం కోరుతూ కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇక మణిపూర్‌ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఇక డీలిమిటేషన్‌పై డీఎంకే ఆందోళన చేపట్టేందుకు రెడీ అవుతోంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమకు చేటు చేస్తుందని డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను ఆయన ఆదివారం ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన పుర్వివభజనను, తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని పార్లమెంటులో గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు.