Air India: వరసగా పలు వార్తల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఎయిర్ ఇండియా. ఈ ఏడాది మొదట్లో ఓ ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా మరో ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లో నిలిచింది. విమానంలో ప్రయాణిస్తున్న మహిళను తేలు కుట్టింది. ఈ ఘటన గత నెలలో నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయిన తర్వాత బాధితురాలు చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సంస్థ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Bombay High Court: 80 ఏళ్ల న్యాయ పోరాటం.. 93 ఏళ్ల వయసులో మహిళ విజయం..
ఏప్రిల్ 23, 2023న ఎయిర్ ఇండియా ఏఐ630లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలని తేలు కాటువేసిందని, ఇది అత్యంత అరుదైన, దురదృష్టకరమైన సంఘటన అని, మా అధికారులు బాధితురాలితో పాటు ఆసుపత్రికి వెళ్లారని,డిశ్చార్జ్ అయ్యే వరకు ఆమెకు అన్ని సహాయాన్ని అందించారు ఎయిరిండియా ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని మొత్తం తనిఖీ చేసి తేలును గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమానాలను పక్కాగా తనిఖీ చేయాలని కోరింది.
ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యానికి ఎయిరిండియా క్షమాపణ కోరింది. గతంలో కూడా ఇలాగే కొన్ని విమానాల్లో పాములు, కీటకాలు కనుగొనబడ్డాయి. గతేడాది డిసెంబర్‌లో కాలికట్ నుంచి దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కార్గో హోల్డ్‌లో పాము కనిపించింది.