మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అంతా బీజేపీకి మద్దతు ప్రకటించనున్నారు. దీంతో మరోసారి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని.. రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం సాగుతోంది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ కోరనున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే అధికారం జేజారిపోవడంపై శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన అధికారం కోసం పుట్టలేదని.. అధికారమే శివసేన కోసం పుట్టిందని.. ఇది బాలా సాహెబ్ ఠాక్రే మంత్రం అని అన్నారు. నిన్న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసే సమయంలో మేమంతా భావోద్వేగానికి గురయ్యామని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రేపై అందరికీ విశ్వాసం ఉందని.. అన్ని కులాలు, మతాల ప్రజలు అతడికి మద్దతు ఇస్తారని.. సోనియాగాంధీ, శరద్ పవార్ తమను విశ్వసిస్తున్నారని అన్నారు.
తనను ఈడీ విచారణపై స్పందించారు సంజయ్ రౌత్. ఈడీ విచారణకు వెళతానని ఆయన వెల్లడించారు. పత్రాచల్ భూముల కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జూలై1న ఈడీ ముందు హాజరుకావాలని సంజయ్ రౌత్ కు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఈ రోజు మహారాష్ట్ర విధాన్ భవన్‌లో సమావేశం కానున్నారు.