Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తిదాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో దాడిచి సైఫ్ అలీ ఖాన్‌ని గాయపరిచాడు. సైఫ్ శరీరంపై ఆరో చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకపై తీవ్ర గాయం కావడంతో పాటు మెడపై గాయాలు ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి, ఆయన వెన్నుముకలో విరిగిన కత్తి భాగాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
Read Also: Nithiin : మొత్తానికి రిలీజ్ డేట్ ప్రకటించిన ‘రాబిన్ హుడ్’
ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ రూ. 35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బుపా పేర్కొంది. క్లెయిమ్ చేసిన దాంట్లో రూ. 25 లక్షలు అప్రూవ్ చేసినట్లు వెల్లడించింది. పూర్తి చికిత్స తర్వాత తుది బిల్లులు సమర్పించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని సెటిల్ చేస్తామని నివా బుపా పేర్కొంది. సైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు సోషల్ మీడియాలో కనిపించాయి. చికిత్స ఖర్చు, అతడి డిశ్చార్జ్ తేదీల వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో స్పెషల్ సూట్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. జనవరి 21, 2025న డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది.
అన్ని వైటల్ రిపోర్ట్స్ నార్మల్‌గా ఉంటే జనవరి 20న కూడా డిశ్చార్జ్ చేయవచ్చని తెలుస్తోంది. నివాబుపా ఒక ప్రకటనలో.. ‘‘యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన ఘటన దురదృష్టకరం, చాలా ఆందోళనకరం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఆయన ఆస్పత్రిలో చేరిన తర్వాత క్యాష్ లెస్ ముందస్తు అభ్యర్థన మాకు పంపబడింది. చికిత్స ప్రారంభించడానికి ప్రారంభ మొత్తాన్ని మేము అంగీకరించాము. పూర్తి చికిత్స పూర్తయిన తర్వాత తుది బిల్లులు అందిన తర్వాత పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం బిల్లులను సెటిల్ చేస్తాం’’ అని చెప్పింది.