Nikki Yadav Case: శ్రద్ధా వాకర్ హత్య తర్వాత ఢిల్లీలో చోటు చేసుకున్న నిక్కీ యాదవ్ హత్య సంచలనంగా మారింది. సహజీవనంలో ఉన్న 23 ఏళ్ల నిక్కీ యాదవ్ ను, అతని ప్రియుడు సాహిల్ గెహ్లాట్(24) ఛార్జింగ్ కేబుల్ తో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచి పెట్టి మరో యువతిని వివాహం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సహజీవనంలో ఉన్నారని అనుకున్నప్పటికీ.. నిక్కీ యాదవ్- సాహిల్ గెహ్లాట్ కు అంతకుముందే పెళ్లి అయిందని పోలీసులు తెలిపారు.
Read Also: Pakistan: పాత సాయానికే కొత్త ప్యాకింగ్.. టర్కీ పంపిన సాయాన్ని మళ్లీ టర్కీకే పంపిన పాకిస్తాన్
వీరిద్దరికి 2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఆర్యసమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిక్కీ యాదవ్ ను పెళ్లి చేసుకోవడంపై సాహిల్ కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని.. తరుచుగా నిక్కీని వెళ్లిపోవాలని కోరారు. ఈ హత్యలో సాహిల్ కుటుంబంతో పాటు స్నేహితుల ప్రమేయం ఉండటంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాహిల్ తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు అనీష్, నవీన్, స్నేహితులు లోకేష్, అమర్‌లను అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే రెండో పెళ్లి చేసుకునేందుకు సాహిల్ సిద్ధం కావడంతో దీనిపై నిక్కీ యాదవ్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య మూడు గంటల పాటు గొడవ జరిగింది. అయితే చాలా సమయం పాటు గొడవ జరిగిన తర్వాత సాహిల్, నిక్కీని హత్య చేశాడు. సాహిల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో అతని ధాబాలోని ఫ్రిజ్ లో నిక్కీ మృతదేహాన్ని దాచాడు. వేరొకరిని పెళ్లి చేసుకుంటే కేసు పెడతానని నిక్కీ యాదవ్ బెదిరించడంతో సాహిల్ ఆమెను హత్య చేశాడు. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే ఈ హత్య ఉండటం, ఇందులో కూడా సహజీవనం హత్యకు ప్రధాన కారణంగా కనిపించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ప్రస్తుతం సాహిల్ ను ఇటీవల పెళ్లి చేసుకున్న అమ్మాయి, వాళ్ల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం.