Gokarna: కర్ణాటకలోని గోకర్ణలోని రామతీర్థ కొండపై ఉన్న మారుమూల మరియు ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలను పోలీసులు రక్షించారు. గోకర్ణ పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో, అడవిలో ఒక తాత్కాలిక నివాసంలో ఈ ముగ్గురిని కనుగొన్నారు. జూలై 9న గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ ఎస్ఆర్ తన బృందంతో పర్యాటకుల భద్రత కోసం గస్తీ తిరుగుతున్న సమయంలో రామ తీర్థ కొండ ప్రాంతంలో, అడవిలోని ఒక గుహ వద్ద వీరు కనిపించారు.
Read Also: Gudivada: గుడివాడలో బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ ప్రోగ్రాం.. సమావేశానికి కొడాలి నాని దూరం
దర్యాప్తులో మహిళను రష్యాకు చెందిన 40 ఏళ్ల నీనా కుటినాగా గుర్తించారు. ఆమె ఇద్దరు కుమార్తెలు 6, 4 ఏళ్ల ప్రేమ, ఆమాగా గుర్తించారు. వీరంతా కలిసి గుహ లోపల నివసిస్తున్నట్లు కనుగొన్నారు. విచారణలో, గోవా నుంచి గోకర్ణకు ఆధ్యాత్మక ఏకాంతం కోసం వచ్చినట్లు నీనా చెప్పారు. ధ్యానం, ప్రార్థనల్లో పాల్గొనేందుకు అటవీ గుహలో ఉన్నట్లు చెప్పింది. అయితే, ఆమె ఉద్దేశాలు ఆధ్యాత్మికమైనప్పటికీ, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం, చిన్న పిల్లలు ఉండటంతో పోలీసులు వారిని రెస్క్యూ చేశారు. కౌన్సిలింగ్ తర్వాత, ఆ మహిళ అభ్యర్థన మేరకు, ఆమెను కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసి స్వామి యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు.
గోకర్ణ పోలీసులు, అటవీ అధికారులు వీరి వీసా పత్రాలను గుహలోనే గుర్తించారు. నీనా మొదట ఏప్రిల్ 17, 2017 వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసాపై భారతదేశంలోకి ప్రవేశించిందని తేలింది. ఏప్రిల్ 19, 2018న గోవాలోని FRRO పనాజీ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడింది. ఆమె తరువాత నేపాల్‌కు వెళ్లి సెప్టెంబర్ 8, 2018న తిరిగి భారతదేశంలోకి ప్రవేశించిందని రికార్డులు చూపించాయి. ఆమె కాలపరిమితికి మించి భారత్‌లో ఉంటుంనందున, రష్యాకు పంపిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.