Mahua Moitra row: మహువా మోయిత్రా వివాదం దేశం అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్యాష్ ఫర్ క్వేరీ కేసుగా పిలువబడుతున్న ఈ వివాదంలో ఇప్పటికే ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. మెజారిటీ ప్యానెల్ ఆమెను ఎంపీ పదవి నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసింది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు అభియోగాలు మోయిత్రాపై వచ్చాయి. దీంతో పాటు ఆమె తన పార్లమెంట్ లాగిన్ వివరాలను కూడా ఇతరులతో పంచుకున్నట్లు వెల్లడైంది. మహువా ఇండియాలో ఉన్న సమయంలో కూడా దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు వెల్లడైంది. లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను ఇతరులకు ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది.
Read Also: Mumbai Indians: ఈ విదేశీ ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఫోకస్.. జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాలు..!
ఇదిలా ఉంటే ప్రస్తుతం లోక్‌సభ సెక్రటేరియట్ పార్లమెంట్ వెబ్‌సైట్ యాక్సెస్ చేసే నిబంధనలను గురువారం మార్చారు. ఇకపై ఎంపీల పీఏలు, కార్యదర్శులు డిజిటల్ సంసద్ పోర్టల్, యాప్స్ యాక్సెస్ చేసే వీలు ఉండదు. సభల్లో ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు బయటకు రాకూడదని లోక్ సభ డాక్యుమెంట్ పేర్కొంది. థర్డ్ పార్టీ డిజిటల్ సంసద్ వెబ్సైట్ యాక్సెస్ చేయలేరు. ఎంపీల తరుపున నోటీసులు ఇవ్వడం కానీ, ప్రశ్నలను అడగటం కానీ చేయలేరు. ఎంపీలు మాత్రమే తమ లాగిన్ వివరాలు ఉపయోగించి సైట్ యాక్సెస్ చేయవచ్చు. ఓటీపీ ఎంపీల రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్లకు మాత్రమే వస్తాయి, వారు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే వెబ్సైట్ యాక్సెస్ అవుతుంది.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదటిసారిగా మహువా మోయిత్రాపై ఆరోపణలు చేస్తూ, ఆమె వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుని ప్రధాని మోడీని, అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగినట్లు, వారిపై విచారణ చేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. దీంతో పాటు ఆమె లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకున్నట్లు ఆరోపించారు. అయితే తాను లాగిన్ వివరాలను పంచుకున్నట్లు మోయిత్రా కూడా ఒప్పుకున్నారు, అయితే ప్రశ్నలను టైప్ చేయడానికి మాత్రమే వివరాలు ఇచ్చానని, ఓటీపీ నాకే వస్తుందని గతంలో తెలిపారు.