Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో దుమారానికి కారణమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లు సాధిస్తే, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆర్జేడీ కేవలం 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరాజయంతో ఆర్జేడీ చీఫ్ లాలూ ఇంట్లో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఇప్పటికే, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని, రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.
తేజస్వీ యాదవ్ అక్క అయిన రోహిణిపై చెప్పుతో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, రోహిణి తన ‘‘కిడ్నీ’’ దానం చేసి లాలూ ప్రాణాలు కాపాడిన సంగతిని ఆమె గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2022లో తన తండ్రికి కిడ్నీ దానం చేసి చక్కగా చూసుకున్నందుకు, కొంత మంది ఆమె తండ్రికి ‘‘చెడ్డ కిడ్నీ’’ ఇచ్చిందని, ఎన్నికల్లో టికెట్ కోసం డబ్బు తీసుకున్నదని ఆరోపించినట్లు ఆమె చెప్పింది. 46 ఏళ్ల రోహిణి ఆచార్య ఇలా వరసగా సోషల్ మీడియా పోస్టుల పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనమైంది.
Read Also: I Bomma Ravi : ఐ బొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు.. ఇదేం తీరు భయ్యా..?
ఇప్పటికే, లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, కుటుంబం నుంచి విడిపోయి , సొంత పార్టీ పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా రోహిణి వ్యవహారం లాలూ కుటుంబంలో విభేదాలను వీడిలా పడేలా చేసింది. తన తండ్రికి కిడ్నీ ఇచ్చిన విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ నా ముగ్గురు పిల్లలు, నా భర్త, అత్తమామల అనుమతి తీసుకోకుండా నా దేవుడైన తండ్రిని కాపాడాను. ఇవాళ నా కిడ్నీ చెడ్డదైంది. నా లాంటి తప్పు ఎవరూ చేయకండి, ఎవరికీ ఇలాంటి కూతుళ్లు పుట్టకూడదు’’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనను అసభ్యం తిట్టినట్లు, చెప్పుతో దాడి చేయాలని యత్నించినట్లు పేర్కొన్నారు. తన స్వాభిమానం కోసం తాను తలవంచలేదని, నిజం చెప్పడం తప్పా, తాను ఏం చేయలేదని అన్నారు. తనను తన పుట్టింటి నుంచి తోసేశారని, తనను అనాథ చేశారని రోహిణి భావోద్వేగ పోస్టులు చేసింది.
ఈ వివాదంపై బీజేపీ స్పందించింది. రోహిణి తన ప్రాణాలు లెక్కచేయకుండా కిడ్నీ ఇచ్చిందని, లాలూ మాత్రం ఆయన కొడుకుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, రోహిణిపై చెప్పులతో దాడి పితృస్వామ్య వ్యవస్థ, మహిళా వ్యతిరేకత, పురుషాధిక్య భావజాలాన్ని చూపిస్తోందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయా అన్నారు. ఆర్జేడీలో కనిపించే అరాచకం ఇప్పుడు కుటుంబంలో కనిపిస్తోందని, ఇలాంటి వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించారు.