Supreme Court: చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని కూడా లాక్కోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు’’ అని చెప్పింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం -1978 కారణంగా ఆస్తిపై హక్కు ప్రాథమిక హక్కుగా తొలగించారు, అయితే సంక్షేమ రాజ్యంలో ఇది రాజ్యాంగలోని ఆర్టికల్ 300ఏ ప్రకారం.. మానవహక్కుగా కొనసాగుతుందని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-ఏ చట్టం యొక్క అధికారం ద్వారా తప్పా, ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదని చెప్పింది.
బెంగళూరు-మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ (BMICP) కోసం భూసేకరణకు సంబంధించి కర్ణాటక హైకోర్టు నవంబర్ 2022 నాటి తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును వెలువరించింది. ‘‘ఇక్కడ చర్చించినట్లుగా, ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కానప్పటికీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ ప్రకారం ఇది రాజ్యాంగ హక్కు’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఒక వ్యక్తికి చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించకుండా అతడి ఆస్తి కోల్పోలేడు.’’ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరిహారంపై కోర్టు తన తీర్పులో చెప్పింది.
Read Also: Delhi Assembly Polls: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
జనవరి 2003లో, ప్రాజెక్టు కోసం భూములను సేకరించేందుకు కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి మండలి(కేఐఏడీబీ) ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిందని, 2005 నవంబర్‌లో అప్పీలుదారుల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు కోర్టు గుర్తించింది. గత 22 ఏళ్లుగా అనేక సందర్భాల్లో భూ యజమానులు కోర్టుల తలుపు తట్టాల్సి వచ్చిందని, వారికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా వారి ఆస్తుల్ని లాక్కున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే అప్పీలుదారులకు పరిహారం అందకుండా పోయిందని కోర్టు చెప్పింది. ధిక్కార నోటీసులు అందిన తర్వాతే, భూమి మార్కెట్ విలువను లెక్కగట్టేందుకు 2011 మార్గదర్శకాలను అనుసరించి, ఏప్రిల్ 22, 2019న పరిహారం నిర్ణయించినట్లు ధర్మాసనం పేర్కొంది.
2003 నాటి మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని అనుమతించినట్లయితే, అది న్యాయాన్ని అపహాస్యం చేసినట్లేనని మరియు ఆర్టికల్ 300-A కింద రాజ్యాంగ నిబంధనలను అపహాస్యం చేసినట్లేనని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం.. ఈ న్యాయస్థానం తన అధికారాన్ని ఉపయోగించి, అప్పీలుదారులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఏప్రిల్ 22, 2019 మార్కెట్ విలువ ఆదారంగా నిర్ణయించాలని ఆదేశిస్తున్నట్లు బెంచ్ తెలిపింది. 2019 ఏప్రిల్ 22 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా రెండు నెలల్లో భూ సేకరణ అధికారి నష్టపరిహారంపై అవార్డును జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.