బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యారావు బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడింది. ఆమె వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం.. అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నివేదికను గత గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. తాజాగా నివేదికకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటక ప్రభుత్వంలో అత్యున్నతమైన పదవిలో ఉన్నారు. మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. అనంతరం ఆమె నివాసాన్ని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభించింది. ఇక డీఆర్ఐ అధికారులు రన్యారావును అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కీలక అంశాలు వెలుగుచూశాయి. తండ్రి పరపతిని ఉపయోగించుకుని వీఐపీ ప్రొటోకాల్‌లో ఆమె పలుమార్లు బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా 3 నెలల కాలంలోనే 27 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లుగా కనిపెట్టారు. ఇదెలా సాధ్యమైందని ఆరా తీయగా.. తండ్రి రామచంద్రరావు అధికారాన్ని ఉపయోగించుకుని బయటకు వచ్చేసినట్లుగా కనిపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ్ గుప్తా నివేదిక సమర్పించింది. ఈ నివేదికతో సంబంధం ఉన్న ఒక అధికారి కీలక విషయాలు వెల్లడించారు. బంగారం స్మగ్లింగ్ విషయం రామచంద్రరావుకు తెలియదని.. కాకపోతే రన్యారావు వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకుంటున్న విషయం మాత్రం తెలుసని నివేదికలో పేర్కొన్నారు. వీఐపీ ప్రొటోకాల్‌ను బంగారం స్మగ్లింగ్ కోసం ఉపయోగించుకుంటున్నట్లు మాత్రం రామచంద్రరావుకి తెలియదన్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌లో రామచంద్రరావుకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని దర్యాప్తు బృందం తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
రామచంద్రరావు.. అక్టోబర్ 2023 నుంచి డీజీపీగా పనిచేస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే రామచంద్రరావుపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో హవాలా డబ్బు మాయం చేసినట్లుగా రామచంద్రరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్‌గా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కుమార్తె విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Exclusive: యంగ్ హీరోలు మారాల్సిందే.. లేదంటే భారీ మూల్యం తప్పదు
ఇది కూడా చదవండి: Visakha Mayor: గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాసం కోసం కౌంట్డౌన్..