NTV Telugu Site icon

Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన

Kejriwal

Kejriwal

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్‌కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.

రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ప్రకటించింది, పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని ప్రత్యర్థులను హెచ్చరించింది. సీట్ల పంపకంపై వచ్చిన విభేదాల కారణంగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు నిలిచిపోయాయని ప్రకటనలో వెలువడింది.

కాంగ్రెస్‌తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అవసరమైతే పార్టీ ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో నిరంతరం పని చేస్తోందన్నారు. సునీతా కేజ్రీవాల్‌ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని.. పార్టీ బలంగా ఉందని కక్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఆప్ తన అభ్యర్థులను ఎన్నికలకు ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్‌తో చర్చలు కొనసాగించే అవకాశం ఉందని సూచించిన ఆమె.. ఇక ముగింపునకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. ఇక ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. హర్యానాలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఐదు సీట్ల కోసం కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుందనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితాలను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు.