Rangareddy District beat Bengaluru Urban District in terms of Per Capita Income (PCI): తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం జీవనోపాధి కోసం వచ్చే వారిని తెలంగాణ అక్కున చేర్చుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా వెల్లడైన నివేదికల ప్రకారం దక్షిణ భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. ఏకంగా కర్ణాటకలోని బెంగళూర్ అర్భన్ జిల్లాను వెనక్కి నెట్టి తొలిస్థానం సాధించింది.
Read Also: Football Player: ఇరాన్ సంచలన నిర్ణయం.. ఫుట్‌బాల్ ఆటగాడికి మరణశిక్ష
రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 6.25 లక్షలు కాగా.. బెంగళూర్ అర్బన్ జిల్లా తలసరి ఆదాయం రూ.5.42 లక్షలుగా ఉంది. దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒక్క రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్ 10 జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా రూ.3.62 లక్షల తలసరి ఆదాయంతో 5వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయం పరంగా చూస్తే కేరళ, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన జిల్లాలే ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ ఒక్క జిల్లా కూడా తలసరి ఆదాయం విషయంలో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు. టాప్ 10 జిల్లాలను పరిశీలిస్తే రంగారెడ్డి( తెలంగాణ), బెంగళూర్ అర్బన్ (కర్ణాటక), తిరువళ్లూర్ (తమిళనాడు), దక్షిణ కన్నడ (కర్ణాటక), హైదరాబాద్( తెలంగాణ), కోయంబత్తూర్ ( తమిళనాడు), ఈరోడ్ (తమిళనాడు), ఎర్నాకులం( కేరళ), అలప్పుజా (కేరళ), ఉడిపి ( కర్ణాటక) జిల్లాలు ఉన్నాయి.