Ramesh Bidhuri: బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తన తోటి సభ్యుడు, బీఎస్పీ పార్టీకి చెందిన ముస్లిం ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్-3 మిషన్ పై చర్చ సందర్భంగా బిధూరి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిధూరి వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునారవృతమైతే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే బీజేపీ పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేసినప్పటికీ సమస్య సద్దుమణగలేదు. కాంగ్రెస్ నేత జైరాంరమేష్ మాట్లాడుతూ.. బిధూరిని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రక్షణ మంత్రి క్షమాపణలు సరిపోవని, నేను ఇలాంటి భాషను ఎప్పుడు వినలేదని, ఇది డానిష్ అలీని అవమానించడం కాదని, అందరిని అవమానించడమే అని, బీజేపీ ఉద్దేశం ఏంటో తెలుస్తోందని జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా మట్లాడుతూ.. రమేష్ బిధూరిపై ఏం చర్యలు తీసుకున్నారని స్పీకర్ని ప్రశ్నించారు. ముస్లింలు, ఓబీసీలను కించపరడచం బీజేపీ సంస్కృతిలో భాగమని ఆమె ఆరోపించారు.
‘బీజేపీ గుండాయిజం చేస్తుందని, సభలో బిధూరి వాడిన భాష గుండా, మాఫియాను తలపిస్తోందని, సాటి ఎంపీని ఉద్దేశించి తీవ్రవాది అని ఎలా వాడుతారని, ఇది ప్రతిపక్ష ఎంపీలందరికీ అవమానం అని, నేను మణిపూర్ సమస్య లేవనెత్తితేనే సస్పెండ్ చేశారని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని’ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ‘బిధూరి టెర్రరిస్ట్ అని చెప్పినట్లయితే, ఆ పదాలు వినడం మాకు అలవాటైంది, ఇది మొత్తం సమాజానికి వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయి, బీజేపీతో సంబంధం ఉన్న ముస్లింలు దీన్ని ఎలా సహిస్తున్నారో అర్థం కావడ లేదు’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు.