Ramdev Charged For Hate Speech: ముస్లింలపై విద్వేషవ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ పై కేసు నమోదు అయింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారు. దీనిపై స్థానికంగా ఉండే పథాయ్ ఖాన్ చౌహతాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఏ (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాస స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ (మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యం, హానికరమైన చర్యలు), 298ఏ(మతపరమైన భావాలను దెబ్బతీయాలని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: CM KCR : దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడం లేదు
ఫిబ్రవరి 2న బార్మర్ లో జరిగిన ఓ సమావేశంలో ముస్లింలపై బాబా రామ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదు సార్లు నమాజ్ చేస్తున్న ముస్లింలు హిందూ యువతులను అపహరిస్తున్నారని, ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇస్లాం, క్రిష్టియన్ మతాల వారు ఉద్దేశపూర్వకంగా మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముస్లింలు నమాజ్ చేసి, క్రైస్తవులు చర్చిలో కొవ్వత్తి వెలిగించి పాపాలు పోతాయని అనుకుంటున్నారని, హిందూ మతంలో ఇలాంటివేం లేవని ఆయన అన్నారు. ముస్లింల వస్త్రధారణపై కూడా కామెంట్స్ చేశారు. హిందూ మతం మంచి చేయాలని భోధిస్తుంటే.. ఈ రెండు మతాలు మత మార్పిడిపై నిమగ్నమై ఉన్నాయని ఆరోపించారు.