Ram Mandir Holiday: రేపు(జనవరి 22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి యావత్ దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం జరిగే అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధాని ముఖ్యపోషకుడి హోదాలో ఈ కార్యక్రమానికి హాజవుతున్నారు. మరోవైపు దేశంలోని బిజినెస్, సినీ, స్పో్ర్ట్స్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో సహా సాధువులు 7000 మందికి పైగా అతిథి హోదాలో ఈ ఈవెంట్‌కి రాబోతున్నారు.
ఇదిలా ఉంటే అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో పలు రాష్ట్రాలు జనవరి 22న సెలవు ప్రకటించింది. అనేకా రాష్ట్రాల్లో బ్యాంకులకు, పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. కొన్ని ఆఫీసులకు సగం రోజు సెలవు ప్రకటించాయి.
జనవరి 22న పూర్తిగా పబ్లిక్ హాలిడే ప్రకటించి రాష్ట్రాల జాబితా:
ఉత్తర్ ప్రదేశ్: వేడుకకు కేంద్రంగా అయోధ్య ఉంది. అయోధ్య నగరం ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రాణ ప్రతిష్ట వేడుక రోజున పూర్తి సెలవును ప్రకటించింది. అంటే జనవరి 22న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అన్ని పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు మూసివేయబడతాయి. ఆ రోజు వేడుకలు జరుపుకోవాలని యూపీ ప్రజలను సీఎం యోగి కోరారు.
గోవా: ఉత్తరప్రదేశ్‌తో పాటు, గోవా కూడా జనవరి 22న పూర్తి ప్రభుత్వ సెలవును ప్రకటించింది. అంతకుముందు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయను మూసేస్తున్నట్లు ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్: బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న పూర్తి ప్రభుత్వ సెలవును ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం, ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు కూడా మూసివేయబడతాయి.
హర్యానా: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను జనవరి 22న మూసివేస్తున్నట్లు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రాణ్ ప్రతిష్ఠా వేడుక రోజున మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సగం రోజు సెలవుగా ప్రకటించిన రాష్ట్రాలు:
ఒడిశా: బీజేడీ అధికారంలో ఉన్న ఒడిశాలో నవీన్ పట్నాయక్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులకు జనవరి 22 మధ్యాహ్నం 2:30 గంటల వరకు సగం రోజు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
గుజరాత్: భూపేంద్రభాయ్ పటేల్ ప్రభుత్వం కూడా జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయని ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలల మూసివేతపై అధికారికంగా సర్క్యులర్ వెలువడలేదు.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ లోని బీజేపీ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల్ని మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసేస్తున్నట్లు ప్రకటించింది.
త్రిపుర: ఈ రాష్ట్రం జనవరి 22 న మధ్యాహ్నం 2:30 గంటల వరకు పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు ప్రభుత్వ అధికారులను సగం రోజులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అస్సాం: హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం జనవరి 22న పాక్షిక సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు కళాశాలలు జనవరి 22 మధ్యాహ్నం 2:30 వరకు మూసివేయబడతాయి.
రాజస్థాన్: రాజస్థాన్ కూడా జనవరి 22న మధ్యాహ్నం వరకు సెలవు ప్రకటించింది.
ప్రైవేట్ బ్యాంకులు, కోర్టులు, ఆఫీసులు:
కొన్ని రాష్ట్రాల్లో జనవరి 22న పూర్తిగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. అయితే భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలపై స్పష్టమైన సమాచారం లేదు. ఖాతాదారులు స్థానిక బ్యాంకుల శాఖల్ని అడగాలంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.
రామ మందిర వేడుక నేపథ్యంలో జనవరి 22న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అన్ని కార్యాలయాలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారతదేశంలోని అన్ని కోర్టులకు సెలవు ప్రకటించాలని కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపగా, CJI కార్యాలయం నుండి ఎటువంటి సమాచారం లేదు.