Rajiv Gandhi assassination case: దేశ చరిత్రను, దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఘటనల్లో ముఖ్యమైంది ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతం. ఈ రోజుతో ఆయన హత్య జరిగి 33 ఏళ్లు గడిచాయి. మే 21, 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీ) ఆత్మాహుతి దాడిలో మరణించారు. దేశ స్వాతంత్య్రం తర్వాత వరసగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు దేశ రాజకీయాలను, ముఖ్యంగా కంగ్రెస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
రాజీవ్ గాంధీ హత్య:
1991 మే 21న తమిళనాడు చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన రాజీవ్ గాంధీని శ్రీలంక టైగర్స్ ఆత్మాహుతి దాడిలో హత్య చేశారు. రాజీవ్ గాంధీ పాదాలు తాకేందుకు దగ్గరగా వచ్చిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ అక్కడిక్కడే మరణించారు. ఈ దాడిలో మొత్తంగా 14 మంది మరణించగా… 40 మంది గాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫ్ చేస్తున్న క్రమంలో బాధితుల్లో ఒకరైన హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ ఆత్మాహుతి బాంబర్ శ్రీలంక జాఫ్నాకు చెందిన తేన్మోళి రాజరత్నం అలియాస్ ధనుని తన కెమెరాలో బంధించాడు.
శ్రీలంక సైన్యానికి సపోర్టుగా, వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) 1987లో అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపినందుకు, ఈ ఫోర్స్ శ్రీలంక తమిళులపై దారుణాలకు తెగబడిందనే కోపంతో ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని హత్య చేసినట్లు చెబుతుంటారు.
విచారణ:
ఈ హత్యకు సంబంధించి దర్యాప్తును మే 22, 1991న సీబీఐకి అప్పగించారు. హత్యకు సంబంధించిన భద్రతాలోపాలను పరిశీలించేందుకు జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ కూడా ఏర్పాటు అయింది. ఈ కేసు విచారణలో టాడా కోర్టు 41 మంది నిందితులపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. జస్టిస్ మిలాప్ చంద్ జైన్ మధ్యంతర నివేదికి ఈ ఘటనపై పలు సంచలన విషయాలను బయటపెట్టింది. హత్య సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ, ఎల్టీటీఈతో కుమ్మక్కు అయిందని.. హత్య జరగడానికి ముందు చాలా మంది ఎల్టీటీఈ సభ్యులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించింది. ఈ హత్య కేసులో పథకాన్ని అమలు చేసిన శివరాసన్, తన ఆరుగురు సహచరులతో కలిసి ఆత్మహత్య చేసుకుని బెంగళూర్ లో మరణించాడు.
26 మందికి మరణశిక్ష:
ఈ హత్యతో సంబంధం ఉన్న 26 మందికి చెన్నైలోని టాడా కోర్టు 1998లో 26 మందికి మరణశిక్ష విధించింది. నిందితులు ఈ తీర్పును సవాల్ చేస్తూ 1999లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆ సమయంలో మురుగన్, సంతన్, పెరైవాలా, నళిని మరణశిక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్ లో 19 మందిని విడుదల చేసింది. 2000లో నళిని శిక్షను తగ్గించాలని డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ని కోరింది. అయితే ఆమె క్షమాభిక్ష పిటిషన్ ని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రపతికి పంపగా, దానిని తిరస్కరించారు.
2000లో రాజీవ్ గాంధీ భార్య, మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నళిని కోసం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరారు. 2014లో సుప్రీంకోర్టు నళిని శిక్షను ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మార్చింది.
ఈ కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేస్తూ 2022లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరుగురు దోషులు నళిని, పిఆర్ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్రరాజా, జయకుమార్, శ్రీహరన్ విడుదలయ్యారు. 2022 మేలో ఈ కేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్ ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఎల్టీటీఈ క్షమాపణ:
2011లో ఎల్టీటీఈ ట్రెజరర్, కీలక నేత అయిన కుమరన్ పద్మనాథన్ రాజీవ్ గాంధీ హత్యపై క్షమాపణలు కోరారు. ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ రాజీవ్ గాంధీని చంపినందుకు భారతదేశాన్ని క్షమించాలని కోరారు.