Site icon NTV Telugu

Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..

Raj Thackeray

Raj Thackeray

Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు. ‘‘సత్యాచా మోర్చా(సత్యం కోసం మార్చ్)’’ అనే మార్చ్ నిర్వహించాయి. ప్రతిపక్ష నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ థోరట్, రాజ్‌ ఠాక్రేలు కలిసి ఒకే వేదికను పంచుకున్నారు.

Read Also: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు.. జేడీయూ నేత అరెస్ట్..

వీరంతా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ఓట్లను దొంగిలించడానికి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆరోపించారు. ఎంఎన్ఎస్ కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర అంతటా ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. ‘‘వారు నా పార్టీని దొంగిలించారు. నా తండ్రిని దొంగిలించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఓట్లను దొంగిలిస్తున్నారు’’ అని ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది త్వరలోనే నిప్పురవ్వగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యల్ని బలపరుస్తూ.. ముంబై, నాసిక్, మావల్ తో సహా అనేక నియోజకవర్గాల్లో నకిలీ ఓటర్లను జోడించారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. అధికార పార్టీ నకిలీ ఓట్లను జోడించిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సమిష్టి పోరాటం చేయాలని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పిలునిచ్చారు.

Exit mobile version