Northern Railway: దేశ రాజధానిలోని రెండు మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ మసీదులకు రైల్వే అధికారులు నోటీసులు జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను 15 రోజుల్లోగా తొలగించాలంటూ ఢిల్లీలోని బెంగాలి మార్కెట్ మసీదు, బాబర్ షా టకియా మసీదులకు నార్తర్న్ రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. రైల్వే భూములను ఆక్రమించుకున్న అక్రమ భవనాలు, దేవాలయాలు, మసీదులు ఇతర ప్రార్థనా స్థలాల నిర్వహాకులను కోరుతున్నామని, అందులో భాగంగా మసీదులకు నోటీసులు ఇచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Read also: Megastar Chiranjeevi: అబ్బా ఏమున్నావ్ బాసూ..యంగ్ హీరోలకు నిద్ర పడుతుందా
తామిచ్చిన గడువులోగా ఆక్రమణలు తొలగించాలని, లేనట్లయితే రైల్వే యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అక్రమ కట్టడాలను తొలగించే సమయంలో జరిగే నష్టానికి తాము బాధ్యులం కాదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ.. 400 ఏండ్ల నాటి బాబా షా టకియా మసీదుకు అధికారులు నోటీసులు జారీచేయడం గమనార్హం. గతంలో రైల్వే అధికారులు హనుమంతుడి గుడికి కూడా ఇలాంటి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామంటూ గుడికి మధ్యప్రదేశ్‌లోని రైల్వే అధికారులు ఫిబ్రవరి 13న హుకుం జారీ చేశారు. మొరెనా జిల్లాలో సబల్‌గర్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్‌గేజ్ పనులు జరుగుతున్న క్రమంలో.. హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే దానిని తొలగించాలంటూ గుడికి నోటీసులు జారీ చేశారు. దాని కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును సైతం మీ నుంచే వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. కాగా, పొరపాటున దేవుడి పేరిట నోటీసు జారీ చేశామని, గుడి పూజారి పేరుతో కొత్త నోటీసులు ఇస్తామని రైల్వే అధికారి మనోజ్‌కుమార్ చెప్పారు.