భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. రైల్వే సేవలను ఈజీగా పొందేలా సరికొత్త యాప్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకు టికెట్స్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, పార్శిల్, సరుకు రవాణా విచారణ, ట్రైన్, పీఎన్ఆర్ స్టేటస్, కంప్లైంట్ కోసం రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే రైల్వే సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించిన ఇండియన్ రైల్వే సరికొత్త యాప్ ను పరిచయం చేసింది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్వరైల్’ సూపర్ యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది.
భారతీయ రైల్వే తీసుకొచ్చిన స్వరైల్ యాప్ వివిధ రైల్వే సేవలకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం ఇది బీటా టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంది. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచారు. ఈ యాప్ తర్వాత అందరికీ అందుబాటులోకి రానున్నది. స్వరైల్ సూపర్ యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డెవలప్ చేసింది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు రైల్వే సేవలన్నీ ఇక్కడే పొందే వీలుంటుంది. ఇకపై బుకింగ్ సేవలన్నీ ఒకే చోట పొందొచ్చు. ఈ యాప్ ద్వారా రైల్వే ప్రయాణికుల సమస్యలన్నింటికి పరిష్కారం లభించినట్లే.
స్వరైలు సూపర్ యాప్ అనేక రకాల సేవలను అందిస్తోంది. ఇది రైలు టికెట్ బుకింగ్, అన్‌రిజర్వ్‌డ్ టికెట్ రిజర్వేషన్‌లను సులభతరం చేస్తుంది. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ బుకింగ్, పార్శిల్, సరుకు రవాణా విచారణ, రైలు, PNR స్టేటస్ విచారణ, ఫుడ్ ఆర్డరింగ్ సౌకర్యం, ఫిర్యాదు నిర్వహణ కోసం సహాయాన్ని అందిస్తుంది. దీంతో ప్రయాణికులు తమ ఫోన్లలో వేర్వేరు యాప్స్ ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇది MPIN, బయోమెట్రిక్‌తో సహా అనేక లాగిన్ ఎంపికలతో వస్తుంది. రిజిస్ట్రేషన్ లేకపోతే, మొబైల్ నంబర్, OTP ద్వారా కొన్ని సేవలను పొందవచ్చు.