Rahul Gandhi: అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భగవత్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం.. అయితే, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దేశ ప్రజలందరినీ అవమానించారు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: Sankrantiki Vastunnam : బుల్లి రాజా కోసమైనా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు పోవాల్సిందే
ఇక, బ్రిటీష్ వారిపై పోరాడిన యోధులందరినీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కించపరిచారంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇకనైనా ఆర్ఎస్ఎస్ చేసే ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలి అన్నారు. అయితే, కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. తమ పోరాటంలో న్యాయం ఉంది, దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం గురించి స్పందిస్తూ.. ఈ కొత్త భవనం పార్టీ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది అన్నారు.. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెందుతుంది అని రాహుల్ గాంధీ వెల్లడించారు.